Link copied!
Sign in / Sign up
6
Shares

పిల్లల్లో ఎదుగుదల లోపం ఉంటే ఏం చేయాలి?

పిల్లల మురిపాలు, గారాలు, చిట్టిపొట్టి మాటలు, బుజ్జి బుజ్జి అడుగులు ---వాళ్ల ఆటలు –అసలు ఆ పసిపిల్లలు ఏది చేసినా తలిదండ్రులకు కొండంత సంతోషాన్నిస్తాయి. వాళ్లను ముద్దులాడాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ పిల్లలందరూ ఒకేలా ఉండరు. కొందరు పిల్లలు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటే.... మరికొందరు బిడ్డలు మందకొడిగా ఉంటారు. వయసుకు తగ్గట్టు పెరగరు. పాకడం, నడక నేర్చుకోవడం, మాట్లాడడం వంటి ప్రవర్తనకు సంబంధించిన విషయాల్లో వెనకబడి ఉంటారు. పిల్లల్లో ఎదుగుదల లోపం ఉంటే వాళ్ల భవిష్యత్తు గురించి పేరెంట్స్ ఎంతో ఆందోళనకు గురవుతారు.

 

ఆటిజమ్

పిల్లల్లో ఎదుగుదల లోపాన్ని, ప్రవర్తనకు సంబంధించిన లోటుపాట్లను – ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఎస్ డి) – ‘ఆటిజమ్’ అంటారు. ఇది ఒక అంశానికి సంబంధించిందే కానక్కరలేదు. అన్నీ కలిసిన ఒక విచిత్రమైన పోకడ. ఇదే ఆటిజమ్. సైగలతో కానీ, మాటలతో కానీ ఏదైనా సరిగా కమ్యునికేట్ చేయలేకపోవడం, మొండితనం, మాటలు సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. అయితే పిల్లల్లో ఈ విచిత్ర ప్రవర్తనను వాళ్లకు 24 నెలలు వస్తే కానీ నిర్ధారించలేము. కానీ ఇలాంటి విచిత్రమైన పోకడ మూడు నెలల్లో సైతం కనిపిస్తాయి.

కారణాలు

పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం, లోపభూయిష్టమైన ప్రవర్తన వంశపారంపర్యంగా వస్తాయనుకుంటారు. కానీ...దాంతోపాటు---పుట్టక ముందు, పుట్టిన తర్వాత పరిస్థితులు పిల్లల్లో మానసిక వైకల్యానికి దోహదం చేస్తాయి. పసిపిల్లల మనసును ప్రభావితం చేస్తాయి.

1. గర్భవతుల్లో పోషకాహార లోపం.

 2. ఫోలిక్ ఆమ్లం తగినంతగా లేకపోవడం. 

3. గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో యాంటి డి ప్రెజెంట్స్ –చురుకు దనాన్ని కలిగించే మందులు ఎక్కువ తీసుకోవడం. 

4. దంపతుల వయసు. 

5. మాతృసంబంధమైన ఏదైనా ఇన్ ఫెక్షన్ కు గురికావడం.

 6. కాలుష్య కారకాలైన లోహ సంబంధమైన, పెయింట్ కు సంబంధించిన రసాయనాల ప్రభావం శరీరంపై పడడం. 

7. కాన్పు సమయంలో వచ్చే నియో నాటల్ ఎనీమియా సమస్యలు. బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం.

ఇలాంటి కారణాలు బిడ్డలు ఆటిజానికి గురయ్యేలా చేస్తాయి.

చాలా జాగ్రత్తగా చూసుకోవాలి

పిల్లలకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెడతాం. అంతా డాక్టరే చూసుకుంటాడు అని వదిలేస్తాం. కానీ బిడ్డల పెరుగుదలను, పోకడను తలిదండ్రులు ప్రతిక్షణం, ప్రతి దశలో చాలా జాగ్రత్తగా గమనిస్తూండాలి. అలా శ్రద్ధ తీసుకుంటే పాపల్లో లోటుపాట్లను ఆలస్యం కాకుండా వెంటనే గుర్తించవచ్చు. పాప లేదా బాబు పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు క్రమంగా కొన్ని లక్షణాలు కనబడతాయి.

మూడు నెలల శిశువు ఏం చేయాలి?

1. పాప నవ్వాలి. 

2. చూడాలి

 3. కొత్త ముఖాల్ని గుర్తుపట్టాలి.

 4. కదిలే వస్తువుల్ని కళ్లు తిప్పుతూ చూడాలి. 

5. ఆ వస్తువు కేసి ఆసక్తిగా చూడాలి. 

6. పెద్దగా శబ్దమైతే వెంటనే స్పందించాలి.

తమ బిడ్డ ఇలాంటి లక్షణాల్ని కనబరుస్తుందా లేదా అన్నది తలిదండ్రలు గ్రహించాలి.

6 నెలలప్పుడు ...

1. గట్టిగా అరవాలి, చప్పుడు వచ్చేలా నవ్వాలి. 

2. తను రోజూ చూసేవారిని గుర్తించి, వాళ్ల దగ్గరికి వెళ్లాలి. 

3. ఏదైనా శబ్దం వస్తే అది ఎటువైపు నుంచి వస్తోందో తలతిప్పి చూడాలి. 

4. ఎవరైనా దగ్గరికి తీస్తే వాళ్ల వైపు వెళ్లాలి. 

5. తనకు ఏదైనా వస్తువు కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లాలి. 

6. బాగా నవ్వాలి. 

7.పీకాబూ వంటి చిన్నచిన్న ఆటలపట్ల ఆసక్తి కనబరచాలి.

ఏడాది నిండిన తర్వాత...

1. చుట్టు పక్కల ఉన్న వస్తువుల దగ్గరికి వెళ్లాలి. 

 2. ఎవరైనా కనిపిస్తే రమ్మనో, టాటా చెబుతూనో చేతులూపాలి. 

3. దేన్నైనా పట్టుకొని నిలబడాలి. 

4. వస్తువుల్ని గుర్తించి, దాన్ని చూపిస్తూ పేరు చెప్పగలగాలి.

రెండేళ్లు నిండాక...

1. అప్పటికి మాటలు బాగా రావాలి. చకచకా కొన్ని మాటలైనా మాట్లాడాలి. 

2. మీరు ఏం చేస్తున్నారో సరిగ్గా అలాగే చేసి చూపించగలగాలి. 

3. తను రోజూ చూసే చెంచా, టెలిఫోన్, కుర్చీ వంటివి ఎందుకో తెలుసుకోగలగాలి. 

4. రెండు మాటల పదాల్ని సులభంగా మాట్లాడగలగాలి.

 5. చక్రాల ఆటవస్తువుల్ని నెట్టగలగాలి. 

6. తలిదండ్రులిచ్చే చిన్నచిన్న సూచనల్ని --- అంటే కూచో, ఎగురు, చప్పట్లు కొట్టు వంటివి గ్రహించగలగాలి.

తలిదండ్రులు అశ్రద్ధ చేయకూడదు

పిల్లలు ఎదిగేకొద్దీ ఆయా  దశల్లో చేయాల్సినవి చేయకపోయినా, పెరుగుదల లోపాలు గమనించినా, ఆ లోపం మరింత ఎక్కువ కాకుండా వెంటనే తొలిదశలోనే వైద్యుడికి చూపించాలి. పసిపిల్లలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్లను పట్టించుకోకపోతే వెంటనే గుర్తిస్తారు. ఆ ప్రభావం వాళ్ల మనసుపై పడుతుంది. కాబట్టి తలిదండ్రులు వాళ్లకు ఎంతో ప్రేమను పంచివ్వాలి. అంతేకాదు... కాన్పుకు ముందు కూడా డాక్టర్ సలహాల్ని తప్పక పాటించాలి. అప్పుడే బిడ్డలకు మంచి భవిష్యత్తు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon