పుట్టిన పిల్లలందరూ ఒకేలా ఉండరు. ఒకరు చురుగ్గా ఉంటే మరొకరు బెరుగ్గా ఉంటారు. భయంభయంగా, మందకొడిగా, ఏదో ఆలోచిస్తూ... దిగులుగా ఉంటారు. ఎవరితోనూ కలవరు. పిల్లలు ఇలా ఉంటే తలిదండ్రులు ఆందోళనకు గురవుతుంటారు. పిల్లలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తలిదండ్రులకు కొంతవరకు అవగాహన ఉంటుంది. పిల్లలు చురుగ్గా లేకపోతే కంగారు పడాల్సిన పనిలేదు. జనాభాలో చాలామంది పిల్లలు ఇలాగే ఉన్నారు. అయితే వాళ్లను యాక్టివ్ గా అంటే చురుకుగా మలిచే పద్ధతులూ ఉన్నాయి.
1. కొత్త వాతావరణం అలవాటు కావాలి
పిల్లలు సాధారణంగా కొత్తవాతావరణంలో అంత సులభంగా ఇమడలేరు. అలాంటి సందర్భాల్లో --- కలివిడిగా ఉండమని వారిని బలవంతం చేయకూడదు. పిల్లలు ఎవరితోనూ కలిసి మెలిసి ఉండకపోవడం, ప్రతిదానికీ వెనక్కు తగ్గుతూ సిగ్గుపడుతూ ఉంటే అది మానసిక లోపం కాదు. నలుగురిలో కలిసిపోవడానికి అలాంటివారికి కొంత సమయం పడుతుంది. వారిని దగ్గర కూచోబెట్టుకుని మాట్లాడితే భయం పోయి, ఓ విధమైన ధైర్యం వచ్చి క్రమంగా నలుగురితో మాట్లాడతారు. అలాకాక, బలవంతం చేస్తే ఆందోళనకు గురవుతారు.
2. ఒంటరితనం ఇష్టం
ఎవరితోనూ కలవని పిల్లలు నలుగురి మధ్యలో ఉండడం కన్నా తాము ఒక్కరే ఉండడాన్ని ఇష్టపడతారు. బయటికెళ్లకుండా ఇంట్లోనే ఉండాలనుకునే మన పిల్లల్ని చూసి దిగులు పడక్కర్లేదు. వాళ్లకూ ఇద్దరో ముగ్గురో స్నేహితులుంటారు. వాళ్లో గడపాలనుకుంటారు. పగలు బయట తిరిగినా, చీకటి పడగానే ఇంటికి చేరి వాళ్ల గదిలోకి వెళ్లిపోతారు. వాళ్లు మాట్లాడలేదని అనుకోకండి. కాసేపయ్యాక వాళ్లే వచ్చి చెబుతారు.
3. పిల్లల అభిరుచిని ప్రోత్సహించండి
మీ పిల్లాడికి బాస్కెట్ బాల్ టీమ్ లో చేరాలని కానీ, ఒక ఆర్టిస్ట్ కావాలని కానీ అనుకోకపోవచ్చు. క్రీడలు, చదువుకు సంబంధించి కాకుండా వేరే అభిరుచులున్నప్పుడు... ఆ వయసు వారికి అలాంటి ఇష్టాలు లేకపోయినా ... మీ పిల్లల ఇష్టాల్ని ఎంకరేజ్ చేయండి. వారు సంతోషపడతారు.
4. పిల్లలు చెప్పేది వినండి
పిల్లలు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు మాట్లాడినా ఆ మాటల్లో ఎంతో అర్థం ఉండవచ్చు. ఏదైనా చెప్పాలని కానీ, మాట్లాడాలని కానీ పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి, చెప్పేది వినండి. ఏవైనా ప్రశ్నలు అడగండి. వాళ్లు ఒక్కసారిగా వాళ్ల ఇన్నర్ సర్కిల్ నుంచి బయటికి వచ్చి ఎన్నో చెబుతారు. వాళ్లను మెచ్చుకోండి. అప్పుడు తరచు మాట్లాడతారు. అలాగే, వాళ్లను ఇబ్బంది పెడుతున్న సంగతులు చెప్పినప్పుడు – వాళ్లు మీ సహాయాన్ని కోరుతున్నారని అర్థం చేసుకుని సలహాలివ్వండి. వెనకాడకండి.
5. భయపెట్టేవాళ్లుంటారు
ఎవరితోనూ కలవకుండా, భయం భయంగా ఉండేవాళ్లను భయపెట్టేవాళ్లుంటారు. బెదిరించేవాళ్లుంటారు. ముఖ్యంగా యవ్వనంలోకి అడగుపెట్టినప్పుడు వాళ్లకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితులు మీకు తెలీకపోవచ్చు. కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్ ను ఫేస్ చేసే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు చిన్నప్పటి నుంచే వాళ్లకు కలిగించాలి.
