ఈ కాలం పిల్లల పై సెల్ ఫోన్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఒక్కసారి ఇది చూడండి..!!
ఈ కాలం పిల్లలు మునపటిలా లేరు. ఆ కాలం పిల్లలకన్నా ఇప్పటి పిల్లలకు తెలివితేటలు, చురుకుదనం ఎక్కువ. ఏదైనా చాలా సులభంగా గ్రహిస్తారు. అర్థం చేసుకుంటారు. పిల్లలు ఉపయోగించే గాడ్జెట్స్ లో కూడా ఆ తేడా కనబడుతుంది. ఒక తరం కిందటి పిల్లలు చెక్కబొమ్మలు, ప్లాస్టిక్ లేదా బార్బీ వంటి రబ్బరు బొమ్మలతో ఆడుకునేవారు. అప్పటి పిల్లలకు సెల్ ఫోన్ తెలీదు. అసలు ఇప్పటి పిల్లలు వాడే ఏ గాడ్గెట్ కూడా వాళ్లకు తెలీదు. కానీ ఈ జనరేషన్ పిల్లలు ఇ-జనరేషన్ వారు. వాళ్లిప్పుడు ఐ ఫోన్, ఐ పాడ్, టాబ్ లెట్, కిండిల్, ఎక్స్ బాక్స్ వంటి గాడ్గెట్స్ తో ఆడుకుంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని వాళ్లు లేట్ కాకుండా ఇట్టే పట్టేసుకుంటున్నారు. ఈ గాడ్గెట్స్ ను ఎలా వాడాలో పిల్లలే పెద్ద వాళ్లకు నేర్పిస్తున్నారంటే ఎంత ఫాస్ట్ గా ఉన్నారో తెలుస్తుంది. గాడ్గెట్స్ పిల్లలకు వినోదాన్నే కాక, ఎడ్యుకేషన్ ను అందిస్తున్నాయి. (స్వర్ణారావు)
ఓ చిన్న కథ చెబుతా.
నేనోసారి ఓ షాపింగ్ మాల్ కు వెళ్లి కొనాల్సిన వస్తువుల్ని చూస్తున్నా. నా పక్కనే ఓ బిడ్డ అదేపనిగా ఏడుస్తోంది. పక్కన వాళ్లమ్మ ఉన్నా పట్టించుకోడం లేదు. కొనాల్సినవి సెలెక్ట్ చేసుకోడంలో మునిగిపోయింది. పిల్ల ఏడుపు ఆపడం లేదు. అప్పుడు నేను ఆమెతో మీ పాప ఏడుస్తోంది... అన్నాను. అందుకామె –మా పాపను చూసి గర్వపడుతున్నాను – అంది. తన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదని పాప ఏడుస్తోందని ఆమె చెప్పింది. చివరికి ఫోన్ ఇచ్చేదాకా ఏడుపు ఆపలేదు. ఫోన్ తీసుకున్నాక మెల్లిగా ఏడుపు ఆపడం చూసి నేను ఆశ్చర్యపోయాను. తర్వాత నాతో ఇలా అన్నది --- పిల్లలు బయటికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం చూసి సరదా పడాలి. అలాగే పెంచుతున్నాను. అంతేకానీ, గాడ్గెట్స్ తో ఆడుకోడానికి కాదు.

నేటితరం పిల్లలు గాడ్గట్స్ తో ఆడుకోవడం గురించి, వారిపై వాటి ప్రభావం గురించి పిల్లల మానసిక శాస్త్రవేత్తలు కూడా జాగ్రత్తలు చెబుతున్నారు. పిల్లలు అదేపనిగా ఎలక్ట్రానిక్ గాడ్గట్స్ కు, సెల్ ఫోన్ తెరలకు అతుక్కుపోతే ఆ ప్రభావం వారి ప్రవర్తనపై పడుతుందని, వింతగా ప్రవర్తిస్తారని శాస్త్రవేత్తలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లలు, టీనేజ్ లో ఉండేవారు అదే పనిగా సోషల్ మీడియాను ఉపయోగిస్తే వారి మనస్తత్వంలో ప్రతికూల మార్పులు వస్తాయని వారు చెబుతున్నారు. అయితే, వ్యతిరేక ప్రభావంతో పాటు, సానుకూలత కూడా ఉంది. సామాజిక నైపుణ్యాలను పెంపొందించుకునే వీలు కూడా ఉంది. కానీ, ఈ విషయంలో మరీ అతి పనికిరాదు. పరిమితుల్లోనే ఉండడం మంచిదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. మోడరన్ గాడ్జెట్స్ కు బానిస కావడం కన్నా బయట తిరిగి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని పిల్లలకు చెప్పాలి.
