Link copied!
Sign in / Sign up
18
Shares

ఆడపిల్లలకు ఈ 5 విషయాలలో అస్సలు 'నో' అని చెప్పకూడదు : ప్రతి అమ్మ తప్పక తెలుసుకోవాలి..

ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుంది, ఆడపిల్ల పుట్టాక ఇల్లు మరింత కళకళలాడుతుందని బంధువులో, పెద్దలో ఏదో ఒక సందర్భంలో అనే ఉంటారు. అయితే ఇప్పుడు కూడా అమ్మాయి, అబ్బాయి అనే వ్యత్యాసం చూపించడం, అమ్మాయిలను తక్కువగా చేసి మాట్లాడటం జరుగుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే మొదట తల్లితండ్రుల నుండే ఈ మార్పు రావాలని అంటున్నారు నిపుణులు. ఆడపిల్లలను ఏయే విషయాలలో తక్కువ చేసి మాట్లాడకూడదో, వేటికి నో అని చెప్పకూడదో, ఇలా చేయడం వలన ఏం జరుగుతుందో చూడండి..

1. ఇది నీ వల్ల కాదులే వదిలేయ్.. 

ఆడపిల్లలు ఏదైనా పనిచేస్తున్నప్పుడు లేదా మరేదైనా విషయంలో విజయం సాధించలేక ఓడిపోతే వెంటనే చాలామంది 'ఇక నీ వల్ల కాదులే వదిలేయ్ అమ్మా, మనకెందుకు ఇదంతా..' అంటూ నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే కొన్నిసార్లు తల్లితండ్రులు కూడా ఈ మాటలు అనటం. అబ్బాయితో పాటు అమ్మాయిలను సమానంగా చూస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించకపోవడం వలన ఇక నేనేమీ సాధించలేనని వారిపై వారికున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టిన వాళ్ళవుతారు. 

2. నువ్వు మంచి దానివి కావు 

పిల్లలు ఏదైనా చేస్తున్నప్పుడు అబ్బాయి/అమ్మాయి ఏదైనా పొరపాటు వాళ్లకు తెలియకుండా జరిగినట్లయితే ఎప్పుడు నువ్వింతే చెడ్డ అబ్బాయి/అమ్మాయివి అని అనకూడదు. ఇలా అనటం వలన వారిలోని మంచితనాన్ని మీరే దూరం చేసినవారవుతారు. అవును నేను మంచి అమ్మాయిని కానేమోనని వారిపై వారికే అనుమానాన్ని కలిగించినవారవుతారు. దీనికి బదులుగా మీ అబ్బాయి/అమ్మాయిలో ఉన్నటువంటి బలాలను పాజిటివ్ గా చెప్పండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా చూడండి. 

3. నీ అన్నయ్య, తమ్ముడిని చూసి నేర్చుకో..

ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చినా లేదా ఏదైనా విషయంలో తెలియకుండా తప్పు చేసినా సరే వెంటనే ఒక్కసారి నీ అన్నయ్యను చూడు, తమ్ముడిని చూసి నేర్చుకో అంటూ చెబుతుంటారు. ఇలా ఎప్పటికీ అనకూడదు. అందరూ ఒకే విధంగా ఉండాలని లేదు కదా, ఇతర అమ్మాయిలకు నచ్చిన విషయాలు, చేసే పనులు మన ఇంట్లో పిల్లలు కూడా చేస్తారనుకోకూడదు. వారికి నచ్చిన దారిలో వెళ్లనివ్వాలి, అలాగే ఏది చేస్తే మంచిదో దగ్గరుండి చెప్పడం ఉత్తమం మరియు ఇతరులతో పోల్చకూడదు. 

4. అమ్మా నేను వెళతానమ్మా అని అడిగినప్పుడు 

ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో జరుగుతున్న విషయమే. స్కూల్ లో అందరూ ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తున్నప్పుడు అబ్బాయి వచ్చి అమ్మానాన్నకు చెప్పగానే ఎంత డబ్బులు కావాలి నాన్నా అడుగుతారు, అదే అమ్మాయి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తాను అమ్మా అంటే ఏం వద్దు, ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు ఇంట్లో కూర్చో అని అంటుంటారు. ఇది ప్రతి ఆడపిల్లకు ఎదురవుతూనే ఉంటుంది. అమ్మాయి అడిగినప్పుడు వాళ్ళ సేఫ్టీ గురించి వద్దని చెప్పడం కరెక్టే, కానీ వారికి నచ్చిన ప్రదేశానికి వద్దని చెప్పడం ఫ్రెండ్స్ తో తిరగవద్దని వారి ఆశలను కాదనటం వారికి బాధను కలిగిస్తుంది. అమ్మాయి సేఫ్టీ గురించి ఆలోచిస్తూనే వారి ఆనందానికి ఏం చేస్తే మంచిదో ఆలోచించండి. 

5. నీతో వేగడం మా వల్ల కాదు..

అమ్మాయి అంటే ఇంకా కూడా కాస్త తక్కువగానే చూస్తున్నారు చాలా చోట్ల. అమ్మాయి బయటకు వెళ్లడం తప్పు, ఏదైనా సమస్య గురించి ధైర్యంగా ఎదురించి మాట్లాడుతున్నప్పుడు, అబ్బాయిలతో పోటీగా చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే ఇక నీతో వేగటం మా వల్ల కాదమ్మా, నీకు పెళ్లి చేసి పంపిస్తాం నీ దారి నువ్వు చూసుకో అంటూ అమ్మాయిలతో అనటం వలన ఎంతో ఇబ్బందిగా ఫీలవుతారు. కన్నవాళ్ళ్లే ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరికి చెప్పాలని ఫీలవుతారు. అందుకని ఇలా అనకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే విషయాలు చెప్పండి. 

ఆడపిల్లలను గౌరవిద్దాం, వారిని సంతోషంగా చూసుకుందాం అని అందరూ చెబుతుంటారు.. కానీ పైన చెప్పుకున్న విధంగా వారికి ఆనందాన్ని ఇచ్చే విషయాలకు గౌరవం ఇస్తేనే కదా వారికి నిజమైన సంతోషం.

Image Source : princemahesh.com

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon